Business is booming.

విరాట్ ఒక్కడేనా!

-విజయ్, రాహుల్, పుజార, రిషబ్‌పై భారీ అంచనాలు రోహిత్, రహానే మెప్పిస్తారా?

కంగారూలతో టెస్ట్ సిరీస్ అన్నప్పట్నించి ప్రతి ఒక్కరు విరాట్ కోహ్లీ గురించే మాట్లాడుతున్నారు. రికార్డులు, సెంచరీలు, ఫామ్, బలం, బలహీనతలు ఇలా ప్రతి అంశాన్ని విశ్లేషిస్తున్నారు. కానీ విరాట్ ఒక్కడు ఆడితే సరిపోతుందా? అంటే సరిపోదనే సమాధానం వస్తుంది. మరి అలాంటప్పుడు కంగారూల గడ్డపై అతిపెద్ద ప్రభావం చూపగల ఆటగాళ్లు టీమ్‌ఇండియాలో ఎవరున్నారు? వాళ్ల ఫామ్, సగటు, పరుగులు ఎలా ఉన్నాయి?

వార్నర్, స్మిత్ గైర్హాజరీతో బలహీనపడ్డ ఆసీస్‌పై వీళ్ల దాడి ఎలా ఉండబోతుంది? వీళ్ల ప్రదర్శనతో ఏండ్లుగా ఊరిస్తున్న టెస్ట్ సిరీస్ విజయం భారత్‌కు దక్కుతుందా? పచ్చికతో నిగనిగలాడే బౌన్సీ పిచ్‌లపై బలమైన ఆసీస్ పేస్ అటాక్‌కు వీళ్లు ఎదురునిలుస్తారా? పరుగులు చేస్తారా? అసలు ఆ టాప్-5 బ్యాట్స్‌మెన్ ఎవరో ఓసారి పరిశీలిద్దాం..!

నమస్తే తెలంగాణ క్రీడా విభాగం : పోటీ, పోరాటం, తిట్లు, దూకుడు, రికార్డులు, రివార్డులు, పగలు, ప్రతీకారాలు సమపాళ్లలో ఉండే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌కు రేపటి నుంచి తెరలేవబోతున్నది. స్వదేశంలో బెబ్బులిలా విరుచుకుపడే భారత్‌కు విదేశాల్లో మంచి రికార్డు లేకపోయినా.. దానిని సరిదిద్దుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ సిరీస్‌ను మొదలుపెట్టబోతున్నది.

దీంతో ఈ సిరీస్‌పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి మొదలైంది. అయితే.. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా ప్రదర్శన ఎలా ఉండబోతున్నది. స్మిత్, వార్నర్ లేకపోవడంతో బలహీనపడ్డ కంగారూల బౌలింగ్‌ను భారత బ్యాట్స్‌మెన్ ఆడేసుకుంటారా? విరాట్‌తో పాటు మురళీ విజయ్, రాహుల్, పుజార, రిషబ్ పంత్ ఈ సిరీస్‌లో ఎంత మేరకు ప్రభావం చూపుతారు. వాళ్ల గత ఫామ్, పరుగులు, సగటు ఎలా ఉందో చూద్దాం.

కింగ్ కోహ్లీ..

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ జపిస్తున్న ఏకైక నామం ఇది. ప్రత్యర్థి ఎవరైనా సరే పరుగులు చేయడం, రికార్డులు కొల్లగొట్టడమే లక్ష్యంగా దూసుకుపోతున్న కోహ్లీ ఈ సిరీస్‌లో అత్యంత కీలకం. ఐసీసీ టాప్ ర్యాంకర్‌గా ఈ సిరీస్‌ను ప్రారంభిస్తున్న విరాట్.. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో సూపర్ ఫామ్‌ను చూపెడుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 10 టెస్ట్‌లు ఆడిన కోహ్లీ 59.05 సగటుతో 1063 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలున్నాయి. అయితే ఆడిన 10 టెస్ట్‌ల్లో 8 విదేశాల్లో ఆడటం గమనించాల్సిన అతిపెద్ద అంశం. 5 ఇంగ్లండ్‌లో, 3 దక్షిణాఫ్రికాలో ఆడాడు. ఇంగ్లండ్‌లో ఆడిన ఐదు టెస్ట్‌ల్లో విరాట్ 59.30 సగటుతో 593 పరుగులు సాధించాడు.

సఫారీ గడ్డపై ఆడిన మూడింటిలో 47.66 సగటుతో 286 పరుగులు కొల్లగొట్టాడు. ఇక భారత్‌లో విండీస్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లో 92 సగటుతో 184 పరుగులు చేశాడు. వీటన్నింటిని పక్కనబెడితే ఆసీస్ గడ్డపై కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 8 టెస్ట్‌ల్లో 992 పరుగులు చేశాడు. సగటు 62. అత్యధిక స్కోరు 169 కాగా, ఐదు శతకాలు తన ఖాతాలో ఉన్నాయి. 2014-15లో పర్యటనలో ఇక్కడ ఆడిన విరాట్.. 4 మ్యా చ్‌ల సిరీస్‌లో 692 పరుగులు చేశాడు. ఊహించనిరీతిలో 86.50 సగటు నమోదు చేస్తూ నాలుగు సెంచరీలు బాదాడు.

ముంబైకర్ల పరిస్థితి ఏంటీ?

Rahane-walks-towards
భారత్ జట్టులో కోహ్లీ తర్వాత ఆ స్థాయిలో మెప్పించగల ఆటగాళ్లు రోహిత్, రహానే. అనుభవజ్ఞుడిగా, సాంకేతికంగా బలమైన ఆటగాడిగా ముద్రపడ్డ రహానే విదేశీ పిచ్‌లపై నిలకడగా ఆడే బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. కానీ ఈ ఏడాది బ్యాటింగ్ ఫామ్ అంతంత మాత్రంగానే ఉంది. దక్షిణాఫ్రికాతో తొలి రెండు టెస్ట్‌లకు చోటు దక్కించుకోలేకపోయిన రహానే.. చివరి టెస్ట్‌లో మాత్రం కీలక పాత్ర పోషించి జట్టును గెలిపించాడు. ఇంగ్లండ్‌లో ఆడిన ఐదు టెస్ట్‌ల్లో రెండు అర్ధసెంచరీలతో 257 పరుగులు చేసి నిరాశపర్చాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో కూడా విఫలమయ్యాడు.

అయితే 2014 ఆసీస్ టూర్‌లో నాలుగు టెస్ట్‌ల్లో రహానే 399 పరుగులు సాధించాడు. ఓ సెంచరీ, రెండు అర్ధసెంచరీలతో సత్తా చాటాడు. ఓవరాల్‌గా కెరీర్‌లో 52 టెస్ట్‌లు ఆడిన రహానే సగటు 41.40గా ఉంది. 3271 పరుగులు, 9 సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. మరోవైపు పరిమిత ఓవర్లలో మెరుపులు మెరిపించే రోహిత్.. టెస్ట్‌ల్లో నిలకడగా ఆడలేదు. కాబట్టే ఇన్నాళ్లూ అవకాశం దక్కించుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు అద్భుతమైన అవకాశం అతని ముంగిట ఉంది. పృథ్వీ లేకపోవడంతో ఓపెనింగ్ స్థానానికి ఇతను కూడా గట్టిపోటీదారుడిగా నిలిచాడు. ఈ ఫార్మాట్‌లో ఆడిన మ్యాచ్‌లు తక్కువే అయినా సగటు, స్ట్రయిక్ రేట్ బాగానే ఉంది. కెరీర్‌లో 25 టెస్ట్‌లు ఆడిన ఈ ముంబైకర్ 39.97 సగటుతో 1479 పరుగులు చేశాడు.

వాల్ అవసరం పెద్దది..

Cheteshwar-Pujara
ద్రవిడ్‌కు వారసుడిగా ముద్రపడ్డ చతేశ్వర్ పుజార.. ఈ సిరీస్‌లో అత్యంత కీలకమైన ఆటగాడు. టెక్నికల్‌గా చాలా బలమైన ఈ సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ ఈ ఏడాది ఫర్వాలేదనిపించాడు. జట్టు వికెట్లపతనాన్ని అడ్డుకోవాలన్నా, లక్ష్యాన్ని నిర్దేశించాలన్నా ఇతని ప్రదర్శనే కీలకం. ఈ ఏడాది 10 టెస్ట్‌లు ఆడిన అతను 31.81 సగటుతో 509 పరుగులు చేశాడు. ఏకైక సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. అయితే భారత్ గడ్డపై అసాధారణ ఇన్నింగ్స్ ఆడే ఈ వాల్.. దక్షిణాఫ్రికాలో జరిగిన మూడు టెస్ట్‌ల్లో తేలిపోయాడు. కేవలం 16.66 సగటుతో 100 పరుగులతో ముగించాడు. ప్రొటీస్‌పై ఫామ్ కారణంగా ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు తప్పించారు. కానీ తర్వాతి నాలుగు టెస్ట్‌ల్లో బరిలోకి దిగినా.. 39.71 సగటుతో 278 పరుగులు చేశాడు.

రాహుల్ గాడిలో పడతాడా?

రెండో ఓపెనర్‌గా భావిస్తున్న కేఎల్ రాహుల్ కూడా ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్నాడు. ఈ ఏడాది 10 టెస్ట్‌లు ఆడిన ఈ 26 ఏండ్ల బ్యాట్స్‌మన్ 420 పరుగులే చేశాడు. 24.70 సగటు నమోదు చేసిన రాహుల్ ఒక్క శతకం మాత్రమే సాధించాడు. నిలకడ లేకపోవడం రాహుల్‌కు ఉన్న అతిపెద్ద సమస్య. అయితే పృథ్వీ షా గాయపడటం ఓ రకంగా రాహుల్‌కు అదృష్టమనే చెప్పొచ్చు.

లేకపోతే ఓపెనింగ్ స్థానాలకు తీవ్రమైన పోటీ నెలకొని ఉండేది. ఇంగ్లండ్‌లో ఐదు టెస్ట్‌లు ఆడిన రాహుల్ 299 పరుగులతో సరిపెట్టుకున్నాడు. సగటు 29.90. ఓవల్‌లో జరిగిన ఫైనల్ టెస్ట్‌లో 149 పరుగులు చేయడంతో ఇన్నాళ్లూ ఈ ఫార్మాట్‌లో చోటు నిలుపుకోగలిగాడు. ఆసీస్ గడ్డపై రాహుల్ తొలిసారి ఆడుతుండటంతో భారీ అంచనాలే నెలకొన్ని ఉన్నాయి. వామప్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ చేయడంతో ఇవి మరింతగా పెరిగాయి. మరి ఇన్ని అంచనాల మధ్య ఒత్తిడిని అధిగమించి పరుగులు చేస్తాడో లేదో చూడాలి.

అవకాశం అందుకునేనా?

Rishabh
టెస్ట్‌ల్లో రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడటంతో కుర్రాడు రిషబ్ పంత్‌కు సువర్ణావకాశం వచ్చింది. ప్రస్తుతం వికెట్ కీపింగ్ బాధ్యతలతో పాటు అతని బ్యాటింగ్‌పై అందరి దృష్టినెలకొంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్న రిషబ్.. ఈ సిరీస్‌లో ఎలా మెప్పిస్తాడో చూడాలి. ఆరంభంలో మెరుగ్గా ఆడుతున్నా.. భారీ స్కోరు ముందర ఒత్తిడిని అధిగమించలేక వికెట్ పారేసుకుంటున్నాడు. ఈ లోపాన్ని అధిగమిస్తే అతని బ్యాట్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్‌ను చూడొచ్చు.

మిడిలార్డర్‌లో ధైర్యంగా ఇన్నింగ్స్‌ను నడిపే ఆటగాడిగా రిషబ్ ఎదిగితే కంగారూల గడ్డపై టీమ్‌ఇండియాకు ఎదురు ఉండదు. కెరీర్‌లో ఇప్పటివరకు 5 టెస్ట్‌లు ఆడాడు. ఇంగ్లండ్‌పై మూడు, విండీస్‌పై రెండు. ఈ ఐదింటిలో కలిపి 43.25 సగటుతో 346 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌పై సెంచరీ చేయడంతో అటు జట్టు, ఇటు అభిమానులు ఇతనిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కరీబియన్ టాప్ పేసర్లను ఎదుర్కొని రెండు టెస్ట్‌ల్లో 92 సగటు నమోదు చేసి 184 పరుగులు చేయడం ఆలోచించదగిన విషయం.

మురళీ విజయ్‌దీ మంచి రికార్డే..

murali-vijay
ఈ ైస్టెలిష్ ఓపెనర్‌కు ఈ ఏడాది ఏదీ కలిసిరావడం లేదు. తన కెరీర్‌లోనే అతిపెద్ద సవాలు ఇప్పుడు ఎదుర్కోబోతున్నాడు. ఈ ఏడాది ఆడిన 6 టెస్ట్‌ల్లో 21.18 సగటుతో 233 పరుగులు చేశాడు. ఒకే ఒక్క సెంచరీ సాధించాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో విజయ్ తొలి రెండు మ్యాచ్‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 20, 6, 0, 0 పరుగులు చేశాడు. అండర్సన్, బ్రాడ్‌లాంటి దీటైన పేసర్లను ఎదుర్కోవడంలోనూ ఈ తమిళనాడు బ్యాట్స్‌మన్ బాగా తడబడ్డాడు.

ఇతని వైఫల్యం మిడిలార్డర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఫామ్ లేకపోవడంతో మూడో టెస్ట్‌కు జట్టులో చోటు కోల్పోయాడు. చివరి రెండు టెస్ట్‌లకు 18 మందిలో కూడాచోటు దక్కించుకోలేకపోయాడు. విండీస్‌తో రెండు టెస్ట్‌లకు కూడా విజయ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. అయితే శిఖర్ ధవన్ లేకపోవడంతో విజయ్‌కు ఓపెనర్‌గా అవకాశం వస్తుందని అంచనా. దీనికితోడు వామప్ మ్యాచ్‌లో 132 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 129 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. చివరిసారి అడిలైడ్‌లో ఆడినప్పుడు విజయ్ 53, 99 పరుగులు చేశాడు. 2014-15 టూర్‌లో భారత్ 0-2తో సిరీస్ చేజార్చుకున్నా.. విజయ్ మాత్రం 60.25 సగటుతో 482 పరుగులు చేయడం విశేషం.

Comments are closed, but trackbacks and pingbacks are open.