Business is booming.

వినయ విధేయ రామ మూవీ రివ్యూ

స‌మ‌ర్ప‌ణ‌: డి.పార్వ‌తి
నిర్మాణ సంస్థ‌: డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
తారాగ‌ణం: రామ్‌చ‌ర‌ణ్‌, కియ‌రా అద్వాని, వివేక్ ఒబెరాయ్‌, ప్ర‌శాంత్‌, స్నేహ‌, ఆర్య‌న్ రాజేష్‌, మ‌ధుమిత‌, ర‌వివ‌ర్మ‌, హిమ‌జ‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, మ‌ధునంద‌న్‌, ఈషా గుప్తా(స్పెష‌ల్ సాంగ్‌) త‌దిత‌రులు
మాట‌లు: ఎం.ర‌త్నం
క‌ళ‌: ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌
కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర్ రావు, త‌మ్మిరాజు
ఫైట్స్‌: క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌
ఛాయాగ్ర‌హ‌ణం: రిషి పంజాబి, అర్థ‌ర్ ఎ.విల్స‌న్‌
సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌
నిర్మాత‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: బోయ‌పాటి శ్రీను
మాస్ ఇమేజ్ ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తులు కల‌య‌క‌లో సినిమా అంటే ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అలాంటి కాంబినేష‌న్ రాంచ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీనుల‌ది. వీరిద్ద‌రూ క‌ల‌సి సినిమా చేస్తున్నార‌నగానే సినిమా ఎలా ఉంటుందోన‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. ఒక‌వైపు అందుకు త‌గ్గ‌ట్టు పెద్ద తారాగ‌ణంతో భారీ కాన్వాస్‌లో డైరెక్ట‌ర్ బోయ‌పాటి సినిమాను తెర‌కెక్కించాడు.
సినిమా ఫ‌స్ట్ లుక్‌, పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఇలా అన్నీ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. మ‌రోవైపు `రంగ‌స్థ‌లం` త‌ర్వాత రాంచ‌ర‌ణ్ చేస్తోన్న సినిమా కావ‌డంతో అభిమానుల్లో కూడా ఆస‌క్తి పెరిగింది. టైటిల్ సాఫ్ట్‌గానే క‌న‌ప‌డ్డా.. ట్రైల‌ర్ మాత్రం యాక్ష‌న్ బేస్డ్‌గానే క‌న‌ప‌డింది. మ‌రి రామ్‌చ‌ర‌ణ్‌ `విన‌య‌విధేయరామ‌` గా తెర‌పై విన‌య‌, విధేయంగా ఉన్నాడో.. లేక విధ్వంసాన్ని క్రియేట్ చేశాడో తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం..
క‌థ‌:
న‌లుగురు అనాథ పిల్ల‌లు చెత్త‌కుప్ప‌ల్లో పేపర్లు ఏరుకుంటూ ఉంటారు. వారి ప్రాణాల‌కు అనుకోకుండా ప్రమాదం ఏర్ప‌డుతుంది. వారు చనిపోతామ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఓ చిన్న‌పిల్లాడు ఏడుపు విన‌ప‌డుతుంది. ఆ ఏడుపు విన్న‌వారికి చ‌నిపోవాలనే ఆలోచ‌న పోయి.. బ్ర‌త‌కాల‌నుకుంటారు. త‌మ‌కు దొరికిన పిల్ల‌వాడికి రామ్ అనే పేరు పెడ‌తారు. అలా న‌లుగురు కాస్త ఐదుగురు అవుతారు.
అన్న‌ల కోసం రామ్ త‌న చ‌దువు మానుకుని వారి చ‌దువు కోసం పాటు పడ‌తాడు. క్ర‌మంగా రామ్ స‌హా అంద‌రూ పెరిగి పెద్ద‌వుతారు. రామ్‌(రాంచ‌ర‌ణ్‌)కు దూకుడు ఎక్కువ‌. ఎక్క‌డ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటాడోన‌ని అత‌ని పెద్దన్న భువ‌న్ కుమార్(ప్ర‌శాంత్‌) .. ఎవ‌రితో గొడ‌వ ప‌డొద్దు అంటూ మాట తీసుకుంటాడు. వైజాగ్‌లోని రామ్ అన్న‌య్య బై ఎలక్ష‌న్స్‌లో పందెం ప‌రుశురాం(ముఖేష్ రుషి) బావ మ‌రిది బ‌ల్లెం బ‌ల‌రాం(హ‌రీష్ ఉత్త‌మ‌న్‌) ఎదురు నిలిచి ఎల‌క్ష‌న్స్ సజావుగా సాగేలా చూస్తాడు. భువ‌న్‌కు ఎదురు వవ్చిన ప‌రుశురాం మ‌నుషుల‌ను రామ్ చిత‌గ్గొడ‌తాడు.
ప‌గ‌బ‌ట్టిన ప‌రుశురాం ఎస్పీ స‌హ‌కారంతో అంద‌ర‌నీ ఎన్‌కౌంట‌ర్ చేయాల‌నుకుంటాడు. అక్క‌డ‌కు రామ్ కూడా వ‌స్తాడు. అయితే అనుకోకుండా బీహ‌ర్ నుండి వ‌చ్చిన రాజుభాయ్‌(వివేక్ ఒబెరాయ్ ) మ‌నుషులు రామ్ కుటుంబాన్ని చంపాల‌ని చూస్తే.. రామ్ అంద‌రినీ చంపేస్తాడు. బీహార్ ముఖ్య‌మంత్రి(మ‌హేష్ మంజ్రేక‌ర్‌) వ‌చ్చి రామ్‌తో మాట్లాడటం చూసిన ఎస్‌.పి రామ్ బ్యాగ్రౌండ్‌కు భ‌య‌ప‌డి పారిపోతాడు. ఇంత‌కు రామ్‌ను క‌ల‌వ‌డానికి బీహార్ ముఖ్య‌మంత్రి ఎందుకు వ‌స్తాడు? రాజు భాయ్‌కి, రామ్‌కు ఉన్న విరోధం ఏంటి? అస‌లు రాజుభాయ్ వ‌ల్ల రామ్ కుటుంబానికి ఎలాంటి న‌ష్టం జ‌రుగుతుంది? రామ్ త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
ప్ల‌స్ పాయింట్స్‌:
– రామ్‌చ‌ర‌ణ్
– నిర్మాణ విలువ‌లు
– ఇంట‌ర్వెల్ ఏపిసోడ్‌
– యాక్ష‌న్ పార్ట్‌
మైన‌స్ పాయింట్స్‌:
– రొటీన్ క‌థ‌
– హింస ఎక్కువ‌గా క‌న‌ప‌డ‌టం
– ఒక‌ట్రెండు సాంగ్స్ మిన‌హా మిగిలిన పాట‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించేలా లేదు
– లాజిక్స్‌కు మ‌రీ దూరంగా సినిమా ఉండటం
విశ్లేష‌ణ‌
బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా అన‌గానే ఓ అంద‌మైన కుటుంబం, అంత‌కు మించి హింస ఉన్న యాక్ష‌న్ ఎపిసోడ్స్ గురించి ఆలోచించ‌క్క‌ర్లేదు. అవి రెండూ పుష్క‌లంగా ఉన్న సినిమా `విన‌య విధేయ రామ‌`. న‌లుగురు అనాథ‌లు క‌లిసి పెంచుకున్న మ‌రో అనాథ రామ్‌. సొంతంగా ఆసుప‌త్రి ఉన్న డాక్ట‌ర్ వీరికి ఆశ్ర‌య‌మిస్తాడు. కొన్నేళ్ల పాటు న‌లుగురు అన్న‌ద‌మ్ములూ క‌లిసి త‌మ్ముడిని చదివించుకుంటారు. కానీ ఒక సంద‌ర్భంలో త‌మ్ముడు త‌న అన్న‌ల‌కు అండ‌గా నిల‌బ‌డి వాళ్ల‌ని చ‌దివిస్తాడు.
ఇక్క‌డ అర్థం కాని పాయింట్ ఏంటంటే… బాల‌ల చేత ప‌నిచేయించుకోవ‌డం చ‌ట్ట‌విరోధం. అందులోనూ వ‌య‌సులో పెద్ద‌వారు చ‌దువుకుంటుంటే, చిన్న పిల్లాడు ఎలా ప‌నులు చేశాడు? బాల‌కార్మిక చ‌ట్టం ఆ డాక్ట‌ర్‌కి గుర్తుకురాలేదా? ఆ ఒక్క‌బ్బాయిని చ‌దివించ‌లేక‌పోయాడా? స‌రే క‌థలో ఏదో కొత్త‌ద‌నం ఉండాలి కాబ‌ట్టి అలా కానిచ్చేశార‌ని అనుకున్నా త‌ర్వాత కూడా ఇలాంటి అంశాలు చాలానే క‌నిపిస్తాయి. బీహార్ ముఖ్య‌మంత్రి ఎవ‌రో సాక్షాత్తు ఐఏయ‌స్ ఆఫీస‌ర్ భార్య‌కు తెలియ‌క‌పోవ‌డం ఏంటి? అన్న ఐఏయ‌స్ అయితే, త‌మ్ముళ్లు ఇద్ద‌రు ఆయ‌న‌తో పాటు ప్ర‌తి చోట‌కూ ట్రాన్స్ ఫ‌ర్ కావ‌డానికి ఎలా కుదురుతుంది? ఓ సామాన్యుడి కోసం బీహార్ ముఖ్య‌మంత్రి సైనికుల‌తో హైద‌రాబాద్‌కు రావ‌డం సాధ్య‌మైన విష‌య‌మేనా? ఇలాంటి పాయింట్లు చాలానే ఉన్నాయి.
అయితే ఈ మొత్తం చిత్రంలో మెచ్చుకోవాల్సిన విష‌యం హీరోయిజం. త‌న హీరో బ‌లాన్ని బాగా వాడుకున్నాడు ద‌ర్శ‌కుడు. యాక్ష‌న్ ఎపిసోడ్స్ చేయ‌డానికి, భీభ‌త్సాన్ని తెర‌మీద ఓ స్థాయిలో చూపించ‌డానికి బోయ‌పాటి ఘ‌నాపాటి అనే విష‌యం ఈ చిత్రం ద్వారా మ‌రో సారి రుజువైంది. రామ్‌చ‌ర‌ణ్ హీరోయిజం అడుగ‌డుగునా ఎలివేట్ అయింది. నిర్మాత పెట్టిన ఖ‌ర్చు తెర‌మీద భారీగా క‌నిపించింది. ప్ర‌తి ఫ్రేమూ నిండుగా క‌నిపించింది. ముఖేష్‌రుషి ఎపిసోడ్ చివ‌ర‌కు ఏమైందో క్లారిటీ ఉండ‌దు.ప్రీ క్లైమాక్స్ లో స్నేహ‌ను చూస్తే `స‌రైనోడు`లో ర‌కుల్ ప్రీత్‌సింగ్ లుక్‌, ఎమోష‌న్ గుర్తుకొస్తాయి. దేవిశ్రీ పాట‌లు, కెమెరాప‌నిత‌నం, లొకేష‌న్లు, సెట్లు, కాస్ట్యూమ్స్, హార్స్ ఎపిసోడ్‌, న‌టీన‌టుల న‌ట‌న సినిమాకు ప్ల‌స్ పాయింటే. డైలాగులు బావున్నాయి. `ఉచ్చ‌పోయిస్తా` అని ముఖేష్ రుషి అన్న‌ప్పుడు రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌వ‌ర్త‌న బీసీ సెంట‌ర్ల‌కు క‌నెక్ట్ అవుతుంది.
రేటింగ్‌: 2.5/5
బాట‌మ్ లైన్‌: `బోయ‌`మాస్‌.. రామా!

Comments are closed, but trackbacks and pingbacks are open.