Business is booming.

ఉపాధ్యాయ వృత్తి వదిలి…నెలకు లక్ష సంపాదిస్తూ..

ఉపాధ్యాయ వృత్తితో వచ్చే సంపాదన ఆమె కుటుంబ అవసరాలకు సరిపోయేది కాదు. దాంతో సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఆమెలో మొలకెత్తింది. సరిగ్గా అప్పుడే పుట్టగొడుగుల పెంపకం గురించి విన్నారు. తన ఇంట్లోనే పుట్టగొడుగుల పెంపకాన్ని మొదలెట్టారు. మొదట్లో నష్టపోయినా పట్టు వీడలేదు. కష్టాల వానను తట్టుకునేందుకు పుట్ట‘గొడుగు’ను ఆసరాగా చేసుకుని, క్రమక్రమంగా ఆ వ్యాపారంలో ఎదిగారు శ్రీలక్ష్మి. ఇప్పుడు ఆమె నెలకు లక్ష రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. పుట్టగొడుగుల పెంపకంలోని సాధకబాధకాలు ఆమె మాటల్లోనే…
మా సొంతూరు గుడివాడ. పెళ్లయ్యాకే డిగ్రీ, ఆ తర్వాత డబుల్‌ ఎంఎ (అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌, హిస్టరీ) చేశాను. ఇంటి అవసరాల కోసం నేను, నా భర్త కూడా ఒక ప్రైవేటు కళాశాలలో పని చేసేవాళ్లం. కానీ ఆదాయం ఇంటి అవసరాలకు సరిపోయేవి కాదు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకుని, ఎన్నో పోటీ పరీక్షలు రాసా… కానీ ఫలితం దక్కలేదు. ఒక దశలో మానసికంగా బాగా కుంగిపోయా. అప్పుడే సొంతంగా ఏదైనా వ్యాపారం చేద్దామనిపించింది. అయితే ఏ వ్యాపారం చేయాలి? మది నిండా ఎన్నో ప్రశ్నలు… సరిగ్గా అప్పుడే పుట్టగొడుగుల పెంపకం గురించి విన్నా. చిన్నతనం నుంచీ నాకు వ్యవసాయమన్నా, మొక్కలు పెంచడమన్నా చాలా ఇష్టం. అందుకే పుట్టగొడుగుల పెంపకం పట్ల ఆసక్తి పెరిగింది. కష్టపడితే దాన్ని స్వయం ఉపాధిగా మలచుకోవచ్చనిపించింది. ఒకరోజు పేపర్‌లో పుట్టగొడుగుల పెంపకం శిక్షణకు సంబంధించిన ప్రకటన చూసి, విజయవాడ వెళ్లి అందులో శిక్షణ తీసుకున్నా. ఈ ఇంటి పంటను కాపాడుకోవడానికి చాలా శ్రద్ధ అవసరం అనిపించింది. చిన్నపిల్లలను సాకినట్టు వీటిని సాకాలి.
మొదట్లోనే క(న)ష్టాలు…
ప్రారంభంలో పుట్టగొడుగుల పెంపకంలో గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. ఊహించని నష్టాలు సంభవించాయి. నేను 2013లో పుట్టగొడుగుల వ్యాపారాన్ని ప్రారంభించాను. మొదట్లో ఆరువేల రూపాయలు పెట్టి ట్రయల్స్‌ చేశాను. బాగానే వచ్చింది. ఆ తర్వాత ఏకంగా లక్షల్లో పెట్టుబడి పెట్టా. నకిలీ విత్తనాల వల్ల పంట దెబ్బతింది. అంతేకాదు పంట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంచనాలు తప్పడంతో చాలా నష్టం వచ్చింది. ఒక దశలో దీన్ని వదిలేద్దామనుకున్నా. కానీ ‘ఏ లాభం లేకపోతే పుట్టగొడుగుల వ్యాపారాన్ని ఎవరైనా ఎందుకు చేపడతారు’ అని నాకు నేను సర్ది చెప్పుకుని, ఈసారి పుట్టగొడుగులపై లోతైన అధ్యయనం చేయడం ప్రారంభించా. పుట్టగొడుగులను ఎలా పెంచాలో తెలుసుకోవడం కోసం కొన్ని ప్రసిద్ధ వ్యవసాయ సంస్థలలో శిక్షణ తీసుకున్నా.
హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న ‘డైరెక్టర్‌ ఆఫ్‌ మష్రూమ్‌ రీసెర్చ్‌’కి వెళ్లాను. పుట్టగొడుగు పెంపకందారులైన రైతులతో, శాస్త్రవేత్తలతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. అలాగే డిఎంఆర్‌, బెంగళూరులో కూడా పది రోజుల శిక్షణా కార్యక్రమానికి మూడుసార్లు హాజరై మెలకువలు నేర్చుకున్నా. స్పాన్‌, ఎరువు బ్యాగుల నుంచి పుట్టగొడుగులు, పుట్టగొడుగులు కట్‌ చేయడం, ప్యాంకింగ్‌ వంటివన్నీ నేర్చుకున్నా. పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించి ఆసక్తి ఉండాలే గానీ అందులో బోలెడు సబ్జెక్టు ఉంది. నేను తీసుకున్న శిక్షణతో పుట్టగొడుగులను సులభమైన పద్ధతిలో ఎలా పెంచవచ్చో చూపగలిగాను. నేను చేపట్టిన పాల పుట్టగొడుగుల పెంపకం పూర్తిగా వాణిజ్యపరమైనవి. వీటిని ఏడాదిలో 365 రోజులూ పెంచవచ్చు. నిజానికి పుట్టగొడుగుల్లో మూడు వేల రకాలున్నాయి. కానీ వాటిల్లో తినడానికి యోగ్యమైనవి కేవలం ఆరు మాత్రమే. మిగతావన్నీ విషతుల్యమైనవి.
శిక్షణ ఆత్మవిశ్వాసాన్నిచ్చింది..
బటన్‌ పుట్టగొడుగులు మన దగ్గర పెంచకపోవడానికి కారణం అది చాలా ఖరీదైన వ్యవహారం కావడమే. బటన్‌ పుట్టగొడుగులను పెంచాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాలి. పైగా వాటిని ఏసీ గదుల్లోనే పెంచాలి. అయితే హిమాచల్‌ప్రదేశ్‌ లాంటి చోట్ల వాతావరణం ప్రకృతి సిద్ధంగా చల్లగా ఉంటుంది కాబట్టి బటన్‌ పుట్టగొడుగులు అక్కడ బాగా పెరుగుతాయి. అదే పాల పుట్టగొడుగుల పెంపకంలో వైఫల్యాలు ఎదురవడానికి కారణం ఉష్ణోగ్రతల్లోని తేడాలను నియంత్రించలేకపోవడం. పుట్టగొడుగులను పెంచేటప్పుడు సీజన్‌ని అర్థం చేసుకుని తదనుగుణంగా ఫంగస్‌ని వృద్ధి చేయాల్సి ఉంటుంది. నేను స్పాన్‌ తయారీ, కల్టివేషన్‌లలో శిక్షణ తీసుకున్నా. అది నాకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. అలాగే ఒరిస్సా, కేరళ, తమిళనాడు, కోయంబత్తూరు, హైదరాబాద్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీల్లో కూడా శిక్షణ తీసుకున్నా. ఈ సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉంటే తప్ప విజయం సాధించలేమని నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. నేను కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడే పుట్టగొడుగుల పెంపకం మొదలెట్టా. అక్కడ తీవ్ర నష్టం ఎదుర్కొన్నా. దానికి కారణం అక్కడి వాతావరణ పరిస్థితులే. రాజమండ్రి వచ్చిన తర్వాత ఈ బిజినెస్‌ తిరిగి కొనసాగించా. వాతావరణాన్ని బట్టి పుట్టగొడుగులు వేగంగా వృద్ధి చెందుతాయి. వాతావరణమే ఈ వ్యాపారానికి ప్రాణవాయువు.
కుటుంబ తోడ్పాటుతోనే…
ఏ పుట్టగొడుగుల పెంపకంలో తీవ్రనష్టాన్ని చవిచూసానో అందులోనే ఇప్పుడు లాభసాటిగా కొనసాగుతున్నా. ఇందులో నా భర్త, తమ్ముడు, కుటుంబం అండదండలున్నాయి. ప్రస్తుతం నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. ఇందులో నేను సక్సెస్‌ కావడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వ్యవసాయశాఖ నా యూనిట్‌ని మదర్‌ యూనిట్‌గా తీసుకుని ఎంతోమందికి శిక్షణ ఇవ్వడంతో పాటు, పుట్టగొడుగుల పెంపకం గురించి ప్రాక్టికల్‌గా అవగాహన పంచుతోంది. మేం స్పాన్‌ (ఫంగస్‌) యూనిట్‌ని కూడా పెట్టాం. దీనికి కావలసిన విత్తనాలు బెంగుళూరు నుంచి తెస్తాం. పుట్టగొడుగుల పెంపకంపై నిర్వహించే ప్రతి శిక్షణా కార్యక్రమానికి ప్రభుత్వం నన్ను పిలుస్తుంది. నా పరిధి మేర నేను ఈ సబ్జెక్టుపై ఔత్సాహికులకు అవగాహన కలిగిస్తున్నా. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఎంతోమంది మహిళలకు శిక్షణ ఇస్తున్నా. కష్టపడే స్వభావం, పరిశుభ్రత, చీకటి గదులలో పుట్టగొడుగులను జాగ్రత్తగా పెంచితే… తక్కువ పెట్టుబడితో కూడా మంచి లాభాలు పొందొచ్చు. అయితే ఏ వ్యాపారంలోనైనా సక్సెస్‌ వెంటనే లభించదు. దానికి కొంత టైమ్‌ పడుతుంది. అనుభవం పెరిగే కొద్దీ ఉత్పత్తి పెరుగుతుంది. విజయం సొంతమవుతుంది.
డిమాండ్‌ బాగుంది..
మేం సాధారణ పుట్టగొడుగులతోపాటు పాలపుట్టగొడుగుల అమ్మకాలు చేస్తాం. అలాగే స్పాన్‌ (ఫంగస్‌)ని తయారుచేసి అమ్ముతాం. కేసెస్‌ (బ్యాగులు) కూడా అమ్ముతాం. ఒక బ్యాచ్‌లో ఎన్ని బ్యాగులైన పెట్టొచ్చు. కానీ అది యూనిట్‌ సామర్థ్యాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. పుట్టగొడుగుల పెంపకంలో లేబర్‌ సమస్య బాగా ఉంది. లేబర్‌ అందుబాటులో ఉంటే మేం దీన్ని మరింత వృద్ధి చేసేవాళ్లం. మేము ఉత్పత్తి చేసిన పాల పుట్టగొడుగులను హోటల్స్‌కు విక్రయిస్తాం. కర్రీ పాయింట్స్‌కి, మార్కెట్లకి పంపిణీ చేస్తాం. మార్కెట్లో మా పుట్టగొడుగులకు మంచి డిమాండ్‌ ఉంది. 200 గ్రాములుగా పుట్టగొడుగులను ప్యాక్‌ చేసి అమ్ముతాం. ఒక కేజీ పుట్టగొడుగుల ధర 200 రూపాయలదాకా ఉంటుంది. కోసిన పుట్టగొడుగులు వారం రోజుల వరకు పాడవవు. రుచిలో పాల పుట్టగొడుగులు బాగుంటాయి. ముఖ్యంగా ముదిరిన పుట్టగొడుగులతో నేను తయారుచేసిన పుట్టగొడుగుల పచ్చడికి బాగా డిమాండ్‌ ఉంది. పుట్టగొడుగులతో పికిల్‌ చేసిన మొదటి వ్యక్తిని నేనే. ప్రణాళికా బద్ధంగా పుట్టగొడుగుల పెంపకం చేబడితే విదేశాలకు కూడా వీటిని ఎగుమతి చేయొచ్చు.
పోషకాలు పుష్కలం…
 
పుట్టగొడుగులు ఆరోగ్యకరమైన ఆహారం. ఇవి పూర్తిగా శాకాహారం. వీటిల్లో పోషక విలువలు పుష్కలం. పుట్టగొడుగులతో వేపుడు కూర, ఫ్రైడ్‌ రైస్‌, కట్‌లెట్స్‌, బోండా, సమోసాలు, పకోడీల, ఆమ్లెట్‌, బజ్జీలు, కూర్మా, సూప్‌ వంటివెన్నో చేయొచ్చు. వీటిల్లో కొలెస్ట్రాల్‌ ఉండదు. పీచుపదార్థాలు పుష్కలం. క్యాన్సర్‌ రాదు. మధుమేహం ఉన్నవారికి మంచిది. అలాగే ఇవి తింటే బరువు కూడా తగ్గుతారు.

Leave A Reply