Business is booming.

టాయ్‌లెట్‌.. ఏక్‌ ‘సాన్ఫ్‌’ కథ!

పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌ శుభ్రత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. భరించలేనంత కంపు, హానికారక సూక్ష్మక్రిములకు నిలయాలుగా కనిపిస్తాయి అవి. వాటిలో మూత్ర విసర్జన చేయాలంటే మహిళలు ఇబ్బందిపడటమే కాదు, అనారోగ్యానికీ గురవుతున్నారు. చాలామంది మహిళలు వాటిలోకి వెళ్లటం ఇష్టం లేక ఇంటికెళ్లేంత వరకూ ఉగ్గబట్టుకుంటారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపారు ఇద్దరు ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు. మహిళలు నిలబడే మూత్ర విసర్జన చేసేందుకు ఒక ఉత్పత్తిని తయారు చేసి మార్కెట్లోకి తెచ్చారు. దానిపేరు ‘సాన్ఫ్‌’.
హారీ శెహ్రావత్‌, అర్చిత్‌ అగర్వాల్‌లు ఐఐటీ ఢిల్లీలో టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్‌లో మూడో సంవత్సరం విద్యార్థులు. ప్రయాణాల్లో మూత్రశాలల దగ్గర మహిళలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి దీనికో పరిష్కారం కనుగొనాలని భావించారు. తొలుత వీరు అనేక శౌచాలయాలకు వెళ్లి అక్కడి పరిస్థితులను గమనించారు. అవన్నీ అపరిశుభ్రంగా ఉండటమే కాదు, హానికారక సూక్ష్మక్రిములకు నిలయాలు అని గ్రహించారు. మహిళల్లో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ (యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌) రావటానికి ప్రధాన కారణం ఇలాంటి టాయ్‌లెట్లే అని తెలుసుకున్నారు.
మహిళల ఆరోగ్యానికి కవచం…
‘సాన్ఫ్‌’ను తయారు చేయాలనుకున్నప్పుడు పలు వయసుల్లో ఉన్న స్త్రీలందరికీ సరిపోయే డిజైన్‌ను రూపొందించటంలో సమస్య ఎదురైంది. తమకు తెలిసిన ప్రొఫెసర్‌ సహాయం తీసుకున్నారు. ‘సాన్ఫ్‌’ను తయారు చేశాక దాన్ని స్నేహితురాళ్లకు వాడేందుకు ఇచ్చారు. వారి అభిప్రాయం తీసుకొని తగిన మార్పులు చేశారు. ఇటీవల ‘ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం’ సందర్భంగా సాన్ఫ్‌ను ఆవిష్కరించారు.
మహిళలు టాయ్‌లెట్‌ను తాకాల్సిన అవసరం లేకుండానే మూత్ర విసర్జన చేసే వీలుండటం ‘సాన్ఫ్‌’లోని ప్రధాన సౌలభ్యం. దీనివల్ల ఇన్ఫెక్షన్లు సోకవు. భారతీయ మహిళల వస్త్రధారణను దృష్టిలో ఉంచుకొని దీన్ని తయారుచేశారు.
మహిళలు ఒకచేతితో దీన్ని పట్టుకొని మూత్ర విసర్జన చేయవచ్చు. దీని అంచులు కూడా మృదువుగా ఉండటం వల్ల మహిళలు వీటిని వాడేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది కేవలం పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌లో మాత్రమే కాకుండా మహిళలు నెలసరి సమయంలోనూ దీన్ని ఉపయోగించవచ్చు.
గర్భవతులు, వెన్ను, మోకాళ్ల నొప్పులు ఉన్నవాళ్లు, టాయ్‌లెట్‌ సీట్‌పైన కూర్చొవటానికి ఇబ్బందిపడేవారికి ఇది సౌకర్యంగా ఉంటుంది. పైగా పర్యావరణ హితమైనది కూడా. వాడి పారేశాక భూమిలో కలసిపోతుంది. దీని ధర కేవలం రూ. 10 మాత్రమే. ప్రయాణాల్లో పర్సులో పెట్టుకొని కూడా వెళ్లవచ్చు. ప్రస్తుతం ఇది ఫార్మసీల్లో అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో కూడా అమ్ముతున్నారు. ఇప్పటికే నోయిడాలో సాన్ఫ్‌ల తయారీ కోసం ఒక యూనిట్‌ను ఏర్పాటు చేశారు.

Comments are closed, but trackbacks and pingbacks are open.