Business is booming.

పేరు గౌతమి.. చదివింది బీటెక్.. ఒకేసారి అయిదు ప్రభుత్వోద్యోగాలు సాధించి..

ప్రభుత్వ ఉద్యోగమే పంచ ప్రాణాలుగా..
ప్రైవేటు ఉద్యోగం వదిలిపెట్టి.. ప్రభుత్వ ఉద్యోగానికి పట్టుబట్టి
ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గౌతమి
 ప్రభుత్వ ఉద్యోగం నేటి యువత కల.. ఆ ఉద్యోగ సాధనకు ఎన్నో ప్రయత్నాలు. అయితే చాలా మంది ఫలితం సాధించకుండానే ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడిపోతున్నారు. ఆనక ఇంత తప్పు చేశామేంటి అని బాధపడుతున్నారు. అటువంటి వారికి ఈ యువతి ఆదర్శం. ఎందుకంటే చదువు పూర్తవుతుండగానే క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ప్రైవేటు ఉద్యోగం వచ్చింది.. అయినా ఏదో మిస్‌ అవుతున్నాననే ఫీలింగ్‌.. అంతే ఉద్యోగం మానేసింది.. తనకు ఇష్టమైన ప్రభుత్వ ఉద్యోగం వేటలో పడింది.. తొలిసారి కాస్త తడబడినా.. రెండో సారి ఏకంగా ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించింది. నిండయిన ఆత్మవిశ్వాసం.. సాధించాలనే పట్టుదల ఉంటే.. ఏదైనా సాధ్యమేనని నిరూపించింది తణుకు పట్టణానికి చెందిన వరికూటి గౌతమి.
మీ విద్యాభ్యాసం ఎలా సాగింది
నాకు చిన్నతనం నుంచి చదవడం అంటే చాలా ఇష్టం. ఏదైనా అనుకున్నానంటే వెంటనే పూర్తయిపోవాల్సిందే. నేను 6 నుంచి 10వ తరగతి తణుకు జడ్పీ ఉన్నత పాఠశాలలో చదివా.. ఇంటర్మీడియెట్‌ ఎస్‌కేఎస్‌డీ, ఇంజనీరింగ్‌ తాడేపల్లిగూడెం శశి కళాశాలలో పూర్తి చేశా. నేను ఇంటర్‌లో కాలేజీ ఫస్ట్‌ సాధించడంతో అప్పటి కలెక్టర్‌ అవార్డు అందజేశారు. చదువుతుండగానే మూడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు సాధించా. వాటిలో ఒకటి ఎంపిక చేసుకుని జాయినయ్యా.. ఐదు నెలలు పనిచేశా. అయితే ఏదో తెలియని వెలితి. జీవితం రోటీన్‌గా మారిపోయింది. అంతే వెంటనే మానేశా.
ప్రభుత్వ ఉద్యోగం ఎలా సాధించారు
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం నచ్చకపోవడంతో మానేసి ఇంటికి వచ్చేశా.ఆ తరువాత ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్‌ అవ్వాలనిపించింది. తొలిసారి ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టులు రాస్తూ ఎటువంటి కోచింగ్‌ లేకుండా ఇంటి వద్దనే ప్రిపేర్‌ అయ్యా. ఆ తరువాత పోటీ పరీక్షలన్నీ రాసి మూడు ఆఫీసర్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. అయితే అక్కడ కాస్తతడబడ్డాను. ఆ తరువాత ఇంకా పట్టుదల పెరిగింది. రెండో సారి ఎందుకైనా మంచిదని తణుకులో కోచింగ్‌ తీసుకున్నా. అక్కడ చాలా మెలకువలు నేర్చుకున్నా. ప్రత్యేకంగా ఇంటర్వ్యూకు సంబంధించిన అంశాలపై అవగాహన పెంచుకున్నా.. ఆ తరువాత పరీక్షలకు అటెండయ్యా.. అప్పటి నుంచి రాసిన ప్రతీ ఉద్యోగంలోనూ విజయం సాధించా. అంతే చివరికి రిజల్ట్‌ చూస్తే ఒక్కసారిగా ఐదు ఉద్యోగాలు చేతిలో ఉన్నాయి. ఎక్కడ జాయినవ్వాలని కాసేపు ఆలోచించినా నాకిష్టమైన ఇన్స్యూరెన్స్‌ రంగానే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నా.
వచ్చిన ఐదు ఉద్యోగాలు ఏమిటి?
ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించా. 1.యుఐఐసీ అసిస్టెంట్‌, 2. ఆర్‌ఆర్‌బీ స్కేల్‌ -1 , ఐబీపీఎస్‌ కెనరా బ్యాంక్‌ పీవో, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌, ఆర్‌బీఐ అసిస్టెంట్‌ ఉద్యోగాలు సాధించా.అందులో నాకిష్టమైన అడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగం వచ్చింది. అందుకే ఆగస్టు 13న రాజమండ్రిలో జాయినయ్యా. నేను అనుకున్నది సాధించా.
మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం
నా తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, అనురాధ, అన్నయ్య అందించిన ప్రోత్సాహమే నా విజయానికి మూలం. ఎలాగైనా ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనే తపనతో ఇంటిలో రోజుకు సుమారు 10 గంటలు కష్టపడేదానిని. ఆ కష్టమే నాకు విజయాన్నందించింది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. నాకు కోచింగ్‌ ఇచ్చిన ప్రసాద్‌ సార్‌ చాలా సహకరించారు.
నిరుద్యోగులకు మీరిచ్చే సలహా
విజయం సాధించాలంటే కృషి అవసరం. దాంతో పాటు పట్టుదల ముఖ్యం. మన ఆశయం సిద్ధించాలంటే క్రమబద్ధమైన కార్యాచరణ అవసరం. ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం సాధించడం కష్టమేమీ కాదు.

Leave A Reply