Business is booming.

ఓ వైపు ‘లా’ చదువుతూనే.. మరో వైపు బుల్లితెరపై హల్‌చల్ చేస్తున్న యువతి

మధురమే శుభగానం
పాటల పూదోటలో శుభశ్రీ ప్రతిభ
సంప్రదాయ సంగీతంలో మేటి
బుల్లితెర షోలతో పేరు ప్రఖ్యాతులు
వీనులవిందు చేసే మధురమైన గాత్రం
 
స్వరబద్ధమైన సంగీతానికి నాద సౌందర్యమే శ్రావ్యత. ఆ శ్రావ్యమైన శ్రవణాలలో అమృతగానం చేయగలిగిన యువ కోకిలలు తెలుగు సంగీత వనంలో విహరిస్తూ మధుర సాహిత్య మకరందాన్ని పాటల రూపంలో ప్రేక్షకలోకానికి అందిస్తున్నారు. అలా.. తెలుగు కొమ్మల్లో పుట్టిన యువ గాయనీమణే ఐతపు శుభశ్రీ. పాట పాడమనటం ఆలస్యం.. ఆమనిలా ఆలపించి అలరిస్తుంది. ఒకటి విన్నాక మరొకటి వినాలనిపిస్తుంది. ఆ తరువాత పల్లవ మాధుర్యం నుంచి చరణాలలోకి ప్రవేశించి పాటల ప్రవాహంలో ఓలలాడిస్తుంది.చదువులో రాణించడమే కాకుండా సంగీత వేదికలు, బుల్లితెర మ్యూజిక్‌ షోలలో తన గానాన్ని వినిపిస్తూ ప్రేక్షక ఆదరణ పొందుతున్న విజయవాడకు చెందిన శుభశ్రీ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ వివరాలు..
లా చదువుకుంటూ..
మేము సత్యనారాయణపురంలో ఉంటాం. ఎస్‌వీబీ సిద్ధార్థ లా కళాశాలలో బీఏ-ఎల్‌ఎల్‌బీ నాల్గో సంవత్సరం చదువుతున్నాను. అమ్మ లక్ష్మీ బాలత్రిపురసుందరి. నాన్న సుబ్రహ్మణ్యేశ్వరరావు అడ్వకేట్‌. రవీంద్రభారతి స్కూల్‌లో రెండవ తరగతి చదువుతున్న నాటి నుంచి సంగీత విద్వన్మణి లంక అన్నపూర్ణ దగ్గర శిక్షణ తీసుకోవడం ప్రారంభించాను.
ఆ తరువాత రెండేళ్లకు పాడటం ఆరంభమైంది. నాల్గవ తరగతిలోనే కళాదర్శిని కాంపిటీషన్‌లో లలిత సంగీత బృందగానంలో పాడాను. ఆ మరుసటి ఏడాది ఐదవ తరగతిలో బృందంతో పాటు నేనూ సోలోగా లలిత సంగీతం పాడాను. ఆ ఏడాది నాకు ద్వితీయ బహుమతి వచ్చింది. ఇక ఏటా నగరంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ప్రతి వేదికపై పాడేందుకు ఉత్సాహం చూపాను. పోటీ పడిన ప్రతి ఈవెంట్‌లో బహుమతి తప్పనిసరిగా వచ్చేది.
ఎన్నో ‘షో’లు చేశాను
ఇంటర్‌ పూర్తయ్యాక సంగీత విభావరుల్లో ఎక్కువగా పాడే అవకాశం వచ్చింది. మ్యూజిక్‌ ఆర్కెస్ట్రాలతో పాటు సినిమా గాయకులతో షోలు చేశాను. కర్ణాటక సంగీతంలో సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేశాను. ఈ కోర్సులో డిస్టింక్షన్‌ వచ్చింది. యుగళ గీతాలు, లలిత, జానపద, హాస్య గీతాలు, భక్తిరసాలు, విషాద, పేరడీలు, కర్ణాటక సంగీత శైలిలో త్యాగరాజ కృతులు, అన్నమయ్య, రామదాసు, పురందరదాసు వంటి వాగ్గేయకారుల సంకీర్తనలు గానం చేయటం నేర్చుకున్నాను. మయూరి ఆర్కెస్ట్రా, కళావాహిని, పుష్పాంజలి కళాసంస్థ, జీజేబీ ఇలాంటి పలు మ్యూజిక్‌ ఆర్కెస్ట్రాల్లో పాడాను. కర్ణాటక సంగీతంలో స్వరఝరి, లయవేదిక, లయనాద కళాస్రవంతి, త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు, పలు ఆలయాల ఉత్సవాల్లో నా గాత్రం వినిపించాను.
బుల్లితెరపై పాడే అవకాశం
ఓ ప్రైవేట్‌ చానల్‌ నిర్వహించిన మ్యూజిక్‌ షోలో పాడేందుకు నగరంలో ఆడిషన్స్‌ నిర్వహించారు. దాదాపు 70 మంది కళాకారులు హాజరయ్యారు. వారిలో 40 మందిని ఎంపికచేసి హైదరాబాద్‌ పిలిపించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేసిన 70 మందిలో నేనూ ఉన్నాను. పేరడీ సాంగ్స్‌ పోటీలు అక్కడ జరిగాయి. వారిలో బాగా పాడిన 16 మందిని ఎంపిక చేశారు. అందులో నేనూ ఎంపికై 15 పాటలు పాడాను.
ఆ తరువాత మరో చానల్‌ నిర్వహించిన బోల్‌ బేబీ బోల్‌ ఆడిషన్స్‌లో 200 మంది పాల్గొనగా, ఎంపిక చేసిన 70 మందిలో నేనూ ఉన్నాను. వారిలో బాగా పాడిన 48 మందిని ఎంపిక చేశారు. ఎన్నో షోలలో నాలుగు నెలల పాటు అనేక పాటలు పాడాను. బాగా పాడుతున్నానని.. సంగీత దర్శకుడు కోటి, గాయకులు సునీత, మనో నన్ను ప్రోత్సహించారు. నేను పాడిన ‘ఉత్తరాన నీలిమబ్బుల లేఖల్లో..’ పాట వినగానే దర్శకుడు కోటి స్పందిస్తూ.. ‘ఈ పాట సీడీ పెట్టుకుని విన్నట్టుగా ఉంది.’ అని ప్రశంసించిన తీరు మరువలేనిది.
ఆ వారం బెస్ట్‌ సింగర్‌గా నన్ను ఎంపిక చేశారు. గాయకులు హేమచంద్ర, భార్గవి, వాణీ జయరాం, స్వప్నలతో పాడాను. అలనాటి గాయని సుశీలమ్మ, అనంత శ్రీరామ్‌ ముందు గానంచేసి వారి అభినందనలు అందుకున్నాను. న్యాయమూర్తి కావాలన్నది నాన్న కోరిక. చదువుతో పాటు సింగర్‌గా కూడా ఎదగాలన్నది నా కోరిక.

Comments are closed, but trackbacks and pingbacks are open.