Business is booming.

ఎంపీ గుత్తా.. నాడు వార్డు సభ్యుడే

-రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగానూ రాణింపు 
-ప్రజాదరణతో అంచెలంచెలుగా ఎదిగిన సుఖేందర్‌రెడ్డి

వార్డు సభ్యుడిగా రాజకీయ రంగంలోకి అడుగిడిన గుత్తా సుఖేందర్‌రెడ్డి అంచెలంచెలుగా పార్లమెంట్ సభ్యుడిగా ఎదిగారు. పలు హోదాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే మూడు పర్యాయాలు ఎంపీగా గెలుపొందారు. విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయ పునాది వేసుకున్న గుత్తా.. 1971-72లో నానక్‌రాం భగవాన్ సైన్స్ కాలేజీలో విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం ఇందిరాగాంధీ స్ఫూర్తితో 1978లో కాంగ్రెస్ పార్టీలో చేరి 1981లో స్వగ్రామమైన చిట్యాల మండలం ఉరుమడ్ల వార్డు సభ్యుడిగా గెలుపొందారు. 1984లో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా, 1985లో చైర్మన్‌గా పనిచేశారు. 1992లో సింగిల్‌విండో చైర్మన్‌గా గెలుపొందిన గుత్తా.. 1992-1999 వరకు ఉరుమడ్ల పాల సంఘం చైర్మన్‌గా పనిచేశారు. అదే సమయంలో 1992లో నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల యూనియన్‌కు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1995-1999 వరకు ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ చైర్మన్‌గా పనిచేశారు.

అదే సమయంలో 1998లో నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు సభ్యుడిగానూ కొనసాగారు. 1995లో దేవరకొండ జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 1999లో మొదటిసారిగా నల్లగొండ ఎంపీగా గెలుపొందిన గుత్తా.. తిరిగి 2009, 2014లో అదే నల్లగొండ స్థానం నుంచి ఎంపీగా జయకేతనం ఎగురవేశారు. పలు రకాల పదవులను కూడా గుత్తా నిర్వహించారు. అర్బన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, పార్లమెంటు హౌస్ కమిటీ సభ్యుడిగా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ కమిటీ సభ్యుడిగా, ఎంపీ లాడ్స్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం నల్లగొండ ఎంపీగా కొనసాగుతూనే, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.

Comments are closed, but trackbacks and pingbacks are open.