Business is booming.

కొలువులకు కొత్త ట్విస్ట్‌…పాలిగ్రాఫ్‌ టెస్ట్‌!

అప్లికేషన్‌, ఫోన్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌, ఫైనల్‌రౌండ్‌ ఇంటర్వ్యూ… ఆ తర్వాత ఆఫర్‌ లెటర్‌! ఇదీ వరుస. ఈ జాబితాలో ‘పాలిగ్రాఫ్‌ టెస్ట్‌’ కూడా చేరింది. అవును, నిందితులతో నిజం కక్కించే పరీక్షే ఇది! ఇప్పుడు ఉద్యోగార్థుల మీదా ప్రయోగిస్తున్నారు.
కొలువు ఖాయమని సంబరపడిపోతున్న సతీష్‌ ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. ‘పాలిగ్రాఫ్‌ టెస్టులో పాసైన వాళ్లే ఫైనలిస్టులు’ అంటూ ఆ కంపెనీ ట్విస్ట్‌ పెట్టింది. సతీష్‌ ఆశలు పేకమేడల్లా కూలిపోయాయి. ఆ యువకుడు రెండేళ్లక్రితం ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఒకట్రెండు చిన్నాచితకా కొలువులు చేశాడు. ఈసారి, పెద్ద కంపెనీకే గురి పెట్టాలనుకున్నాడు.
చక్కగా తన కరికులమ్‌ వీటే… అదే, సీవీ తయారు చేసుకున్నాడు. అందులో తెగ కోతలు కోశాడు. లేని అనుభవం జోడించాడు. తెలియని విషయాలన్నీ తెలుసన్నట్టుగా పోజు కొట్టాడు. అనుకున్నట్టుగానే, ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. రెక్కలు కట్టుకుని వాలిపోయాడు. మాటల చాతుర్యంతో బోర్డు సభ్యులనూ బుట్టలో పడేశాడు. ఇక, కొలువు ఖాయమనుకున్నాడు. ఆ సమయంలోనే పిడుగులాంటి వార్త. ‘పాలిగ్రాఫ్‌’ టెస్టు పాసైతేనే ఉద్యోగమంటూ మెయిలు పెట్టాడు ఆ కంపెనీ హెచ్‌ఆర్‌ మేనేజరు. అబద్ధాల్ని కుప్పగా పోసిన సతీష్‌కి వెన్నులో వణుకు మొదలైంది.
ఏది నిజం?
రెజ్యూమేను అబద్ధాలతో నింపేద్దామనుకునే ప్రబుద్ధులకి కాలం చెల్లింది. ఆఫర్‌ లెటర్లు ఇచ్చేముందు… అభ్యర్థుల నిజాయతీని బేరీజు వేయాలని చాలా సంస్థలు భావిస్తున్నాయి. డిటెక్టివ్‌ ఏజెన్సీల సాయంతో నిర్వహించే బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌… సగం నిజాల్నే చెబుతుంది. మరి, మిగతా సగం? అభ్యర్థి బుర్రను స్కాన్‌ చేసినంత స్పష్టంగా చదివేయడానికి పాలిగ్రాఫ్‌ టెస్టులు నిర్వహిస్తున్నాయి కార్పొరేట్‌ దిగ్గజాలు. ‘ట్రూత్‌ ల్యాబ్స్‌’, ‘జెకె కన్సల్టెన్సీ’ తదితర ప్రయివేటు ఫోరెన్సిక్‌ సంస్థలు ఆ ప్రయత్నంలో సహకరిస్తున్నాయి.
ఇవి అభ్యర్థుల నిజాయతీని పరీక్షించడానికి లై డిటెక్టర్‌, పాలిగ్రాఫ్‌ తదితర టెస్టులు నిర్వహిస్తాయి. ఇందుకు, ప్రత్యేకంగా ఓ నిపుణుల బృందమూ ఉంటుంది. వీళ్లు అభ్యర్థులకు మూడు రకాల- కంట్రోల్డ్‌, రిలవెంట్‌, ఇర్రిలవెంట్‌ – ప్రశ్నలని సంధిస్తారు. ‘అవును’, ‘కాదు’ పద్ధతిలో జవాబివ్వాలి. అభ్యర్థులు సమాధానం ఇస్తున్నప్పుడు… గ్రాఫ్‌లో వస్తున్న మార్పులను పరిగణనలోకి తీసుకుంటారు. ‘లై డిటెక్షన్‌ టెస్ట్‌’ సమయంలో… అభ్యర్థుల హృదయ స్పందన, రక్తపోటు, నాడి తదితరాలను కూడా పరిశీలిస్తారు. అయితే, పాలిగ్రాఫ్‌ టెస్టు నిర్వహించే ముందు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సిందే. అభ్యర్థుల ఆమోదం లేకుండా పరీక్ష జరపకూడదు.
ఎందుకీ పరీక్ష…
మరీ ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సంస్థలు లైడిటెక్టర్‌ పరీక్షల పట్ల ఆసక్తి చూపిస్తున్నాయి. పట్టాల ఆధారంగానో, పది నిమిషాలు జరిగే ఇంటర్వ్యూను బట్టో అభ్యర్థిని బేరీజు వేయడం కష్టం. అందులోనూ ఆ వ్యక్తి కోట్ల రూపాయల లావాదేవీలకు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఆలోచనలు పక్కదారి పట్టాయా అంతే సంగతులు. ఇక, కార్పొరేట్‌ గూఢచర్య భయం ఉండనే ఉంది.
ప్రత్యర్థి సంస్థ ఇక్కడి వ్యవహారాల్ని తెలుసుకోడానికి తమ మనుషులతో దరఖాస్తు చేయించినా చేయించవచ్చు. ఇవన్నీ పాలిగ్రాఫ్‌ టెస్టులో బయటపడతాయి. ఇందుకు మహా అయితే ఐదు నుంచి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది. ‘అలా అని, మేం దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరిని వేధించం. అనుమానం వస్తేనే వ్యవహారం అక్కడిదాకా వెళ్తుంది’ అంటారు ఓ హెచ్‌ఆర్‌ మేనేజరు. కంపెనీలైనా, ఉద్యోగులైనా ఎవరి జాగ్రత్తలో వారు ఉండాల్సిందే!

Comments are closed, but trackbacks and pingbacks are open.