Business is booming.

కార్పొరేట్‌కు దీటుగా…‘ఉస్మానియా’

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఉస్మానియా దవాఖానలో కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రభుత్వం ఈ వ్యాధి నివారణకు కోట్లాది రూపాయల బడ్జెట్ కేటాయిస్తుండడంతో ఇక్కడ వసతులు మెరుగుపడి రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

గత జనవరిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఉస్మానియాలో తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రతి యేటా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతుండగా.. తెలంగాణ ఏర్పడిన అనంతరం రెట్టింపు అయ్యింది. సుమారు 20 సంవత్సరాలకు పైగా ఉస్మానియాలో కిడ్నీ వ్యాధులకు శస్త్ర చికిత్స నిర్వహిస్తుండగా.. ఇప్పటి వరకు సుమారు వెయ్యికి పైగా వ్యాధి గ్రస్తులకు కిడ్నీ మార్పిడి చేశారు.

వ్యాధి భారిన పడి డయాలసిస్ పొందుతున్న వారు కూడా ఇక్కడ అధికంగా ఉన్నారు. డయాలసిస్ ఓపీ విభాగానికి నిత్యం వంద మందికి పైగా రోగులు వస్తుండగా, వీరిలో అవసరం ఉన్న వారికి మూడు షిప్టుల్లో డయాలసిస్ నిర్వహిస్తున్నారు. ఈ విభాగంలో ప్రస్తుతం 50 పడకలు ఉన్నాయి. వారంలో రెండు యూనిట్ల ద్వారా శస్త్ర చికిత్సలు, నాలుగు రోజులు ఓపీ సేవలందిస్తున్నారు.

ప్రతి సోమవారం కిడ్నీ మార్పిడి, గురువారం డయాలసిస్ రోగులను గుర్తించేందుకు వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. 2009 నుంచి ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ సేవలు రోగులకు అందిస్తున్నారు. కాగా.. ప్రజల్లో అవయవదానంపై అవగాహన లేకపోవడంతో జీవన్‌దాన్ నుంచి అవసరాల మేరకు కిడ్నీలు అందడం లేదు. కిడ్నీ వ్యాధి భారిన పడిన రోగికి కిడ్నీ మార్పిడి కోసం ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానల్లో రూ.7లక్షల వరకు ఖర్చు, డయాలసిస్‌కు నెలకు రూ 30 వేలు, మందులకు రూ 10 వేలు ఖర్చు అవుతుండగా ఉస్మానియాలో ఆయా సేవలను ప్రభుత్వ సహకారంతో ఉచితంగా అందిస్తున్నది.

మూడు షిప్టుల్లో డయాలసిస్ సేవలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు సమకూరుస్తుండడంతో ఉస్మానియాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. నిత్యం వంద మంది కి పైగా ఓపీకి కిడ్నీ రోగులు వస్తున్నారు. నిత్యం మూడు షిప్టుల్లో డయాలసిస్ సేవలు అందిస్తున్నాం. అంతే కాకుండా గత 8 నెలల క్రితం ప్రారంభమైన ఉచిత డయాలసిస్ కేంద్రంలో కార్పొరేట్‌కు ధీటుగా సింగిల్ పోర్ట్ తో మెరుగైన డయాలసిస్ సేవలను అందిస్తున్నాం. 18 పడకలతో ఉదయం 6 గంటల నుంచి నాలు గు షిఫ్టుల వారీగా 72 మందికి నిత్యం డయాలసిస్ అందిస్తున్నాం.

సాధా రణంగా ప్రైవేట్ దవాఖానల్లో డయాలసిస్‌కు వాడే డిస్పోజల్‌తోనే అందరికీ డయాలసిస్ సేవలను అందిస్తారు. దీనికి భిన్నంగా ఉస్మానియాలో ఏర్పాటు చేసిన ఉచిత డయాలసిస్ కేంద్రంలో ఒక వ్యక్తికి డయాలసిస్ చేసిన సమయంలో వాడిన డిస్పోజల్‌ను తిరిగి ఉపయోగించం. దీనినే సింగిల్ పోర్ట్ డయాలసిస్ అంటాం. ప్రభుత్వం రోగుల కోసం నిరంతరం మందుల సరఫరా అందిస్తున్నది. దీంతో దవాఖానకు గతంలో కంటే రోగుల తాకిడి గణనీయంగా పెరిగింది.

– డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్ ఉస్మానియా దవాఖాన

Comments are closed, but trackbacks and pingbacks are open.