Business is booming.

చక్కటీ. బొటిక్!

ఒక బ్యాడింటన్ ప్లేయర్‌గా దేశ, విదేశాలు చుట్టి వచ్చింది.. అవార్డులు.. రివార్డులూ గెలుచుకుంది.. పెండ్లి.. పిల్లలు అయ్యాక అదే కెరీర్ మొదలు పెట్టాలా? లేక తనకంటూ సొంత ఐడెంటిటీని సంపాదించుకోవాలా? అనే ఆలోచనతో తను మెచ్చే, నచ్చే టీ బిజినెస్ చేయాలనుకుంది.. ఒక్క ఆలోచన.. తనను ఈరోజు ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిలబెట్టింది.. ఎక్సోటిక్ బ్లూమింగ్ టీస్ పేరుతో బొటిక్ తెరిచేలా చేసింది.. ఇంతకీ ఆమె పేరు చెప్పనే లేదు కదూ!.. నీలిమా చౌదరి.. డిఫరెంట్ ఫ్లేవర్‌ల టీలను రుచి చూపించేందుకు ఆ బొటిక్ తెరిచింది.. మరి ఆమె చాయ్ కథలు.. ఆమె ఆట ప్రస్థానంమీ కోసం ఇస్తున్నాం.. 
లెమన్ టీ.. గ్రీన్ టీ.. అల్లం టీ.. పుదీనా టీ.. చక్కటి.. చిక్కటి టీలను చేయడంలో మనకు మనమే సాటి. ఇరానీ చాయ్‌ని అక్కడ కంటే మన దగ్గరే టేస్టీగా చేస్తారని ప్రతీతి. ఆ చాయ్‌లు ఈ మధ్య చేదెక్కాయి. అందుకే డైట్ పేరుతో బ్లాక్ టీ, గ్రీన్ టీల బాటన పట్టారు జనాలంతా. కానీ వాటిలో డస్ట్ పార్టికల్స్ వల్ల మనకు తెలియని నష్టం జరుగుతున్నది. ఇది ఎవరైనా గమనించారా? తేనీటి విందు సరిగా ఉన్నప్పుడే రోజు అనేది ప్రశాంతంగా జరిగి, హాయిగా ముగుస్తుంది. అంతటి గొప్పతనం ఉన్న టీ గురించి ఆలోచించి నీలిమ ఒక బొటిక్ తెరిచింది. అక్కడ మనకు కావాల్సిన టీలను రుచి చూసి, మనకు నచ్చిన, మెచ్చిన ఫ్లేవర్ల టీలను కొనుగోలు కూడా చేసుకోవచ్చు.

 

ఏ టీ ఎలా?

చాలా దేశాల్లో.. టీ పొడి రూపంలో ఉండదు. ఆకుల రూపంలోనే ఉంచి మరిగిస్తారు. వీటిని హయ్యండ్ టీలుగా పిలుస్తారు. అవి మన దేశంలో కొన్ని చోట్ల మాత్రమే లభిస్తున్నాయి. వాటిని హైదరాబాద్ వాసులకు చేరువ చేయాలనే ఆలోచనతో టీ బొటిక్‌ని తెరిచింది నీలిమ. మామూలుగా అయితే మనం చాయ్‌లో చక్కెర వేస్తాం. దీనివల్ల మనకు నష్టమేనంటున్నదీమె. అందుకే చక్కెరే కలుపకుండా టీలను ఎలా చేసుకోవాలో కూడా చెబుతున్నది. ఇక్కడ బొటిక్‌లో ఆపిల్ టీ కూడా దొరుకుతుంది. ఆపిల్‌ని ఒక ప్రాసెస్‌లో ఎండబట్టి ఆ ముక్కలనే టీ ఆకుల్లో కలిపి చక్కటి టీ తయారు చేసుకోవచ్చు.

ఒత్తిడిని తగ్గించేందుకు, నిద్ర బాగా పట్టేందుకు కారామిల్ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజ్ టీ, హైబిస్‌కస్ టీలలో.. జీరో కేలరీస్ ఉంటాయి. ఆడవాళ్లకు ఎక్కువగా కండరాల నొప్పి ఉంటుంది. కారణమేదైనా చాలామంది ఈ సమస్యను ఎదుర్కొని ఉండొచ్చు. అయితే ఈ సమస్యకు పరిష్కారమని కాదు.. కానీ కాస్త ఉపశమనం కలుగాలంటే మాత్రం రోజ్ టీ తాగొచ్చు. రక్తపోటును తగ్గించేందుకు హైబిస్‌కస్ టీ బాగా పనిచేస్తుంది. ఇలా రకరకాల టీలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే కచ్చితంగా ఈ టీ ఇలాగే పని చేస్తుందని ఉండదు. కొంతమందికి వారి శరీరతత్వాన్ని బట్టి ఇది పనిచేసే అవకాశం ఉంటుంది.

ఫ్లేవర్‌లతో పసందుగా..

నీటిని ఎక్కువ తాగక నానా రకాల ఇబ్బందులు పడుతున్నది నేటి యువత. శరీరంలో నీటి శాతం పెరుగాలంటే.. నీటికి కూడా ఫ్లేవర్స్ కలిపితే మరిన్ని నీళ్లు తాగుతాం. అలా మొదలైందే చాయ్ కల్చర్. విదేశాలకు వెళ్లినప్పుడ నీలిమ ఐస్ టీలను బాగా తాగేది. ఐస్ టీ అంటే ఇక్కడ చాయ్‌ల్లో ఐస్‌క్యూబ్‌లు వేసిచ్చినట్టు కాదు. అక్కడ వేరేలా ఉండేవి. దాంతో మనకెందుకు ఇలాంటి చాయ్‌లు ఉండవు అనుకుంది. సిరప్‌లు వేసి చాయ్ చేయడమేంటి అనిపించింది.

బేస్‌లో బ్లాక్ టీ, గ్రీన్ టీ పోసి ఆ తర్వాత ప్రాపర్ చాయ్‌లను తయారు చేస్తారక్కడ. ఇదే విధానాన్ని మన దేశానికి పరిచయం చేయాలనుకుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవాళ్లు ఈ టీల కోసం కాస్త సమయాన్ని మాత్రం కేటాయించాలంటున్నది. ఈ టీలను తయారు చేయడానికి నీలిమ పెద్ద రీసెర్చే చేసింది. ఈ టీ ఆకులను మనదేశం నుంచే కాదు చైనా, జపాన్, థాయ్‌లాండ్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ టీ తయారీ రీసెర్చి సంవత్సరన్నర క్రితం మొదలు పెట్టినా.. బొటిక్ మొదలుపెట్టి రెండు నెలలయింది. చాలా కాఫీషాప్‌లకు అంతకుముందు నుంచే ఈమె టీ ప్యాకెట్‌లు వెళుతున్నాయి. హైదరాబాద్‌లోని 20 నుంచి 25 కాఫీ షాప్‌ల యజమానులు నీలిమ దగ్గర టీ ఆకులను ప్రత్యేకంగా ఆర్డర్ తీసుకొని మరీ వెళుతుంటారు.

స్పెషాలిటీ..

నీలిమ బ్యాడ్మింటన్ ప్లేయర్. పెండ్లయ్యాక ఆట మానేసి భారత్ పెట్రోలియంలో ఉద్యోగం చేసేది. పిల్లలు పుట్టాక ఆ ఉద్యోగం కూడా మానేసింది. చిన్నప్పటి నుంచి ఆటల కారణంగా దేశ, విదేశాలూ తిరిగిన అలవాటు నీలిమకి. అందుకే పిల్లలకు ఏ కాస్త సమయం దొరికినా దేశంలోని ప్రాంతాలకూ, విదేశాలకూ వెళ్లేవారు. అక్కడ రుచి చూసిన టీ ఆమెకు ఎంతో నచ్చేది. కానీ ఇండియాకి వచ్చేసరికి చేదు వల్ల టీ మానేసింది. అప్పుడప్పుడు అక్కడ నుంచి టీ ప్యాకెట్‌లు తెచ్చుకున్నా అవి సంవత్సరమంతా సరిపోయేవి కావు. తనలాగా చాలామంది ఆలోచిస్తారని అనిపించి ఈ టీలు తానే ఎందుకు తయారు చేయకూడదనుకుంది.

ఒంటరిగా మొదలుపెట్టి ఇప్పుడు మరో ఇద్దరికి ఉపాధి అందిస్తున్నది. మామూలుగా అయితే టీ పొడి వేస్తే ఒక్కసారే పెట్టుకోవచ్చు. టీ బ్యాగుతో అయినా అంతే చేయగలరు. కానీ నీలిమ దగ్గర ఉన్న టీ ఆకులతో కనీసం రెండుసార్లు టీ పెట్టుకోవచ్చు. ఆ రుచి కూడా తగ్గదు. ఈమె దగ్గర దొరికే టీలు.. రూ. 200 వరకు రూ. 2500 వరకు లభ్యమవుతాయి. ఆమె దగ్గర స్పెషల్‌గా డ్రై సిల్వర్ నీడ్స్ టీ దొరుకుతుంది. ఈ తేయాకులను పౌర్ణమి రోజున మాత్రమే తెంపి నిల్వ చేస్తారు. వీటి ధర అన్నింటి కంటే ఎక్కువ ఉంటుంది. కిలో కనీసం 20 వేల ధర కూడా పలుకుతుంది. కేవలం టీని మాత్రమే అమ్మితే ఏం బాగుంటుందునుకొని తేనె, టీ కప్పులు, టీ పాట్‌లు కూడా ఈ బొటిక్‌లో అందుబాటులో పెట్టింది.

ఆటలో మేటి..

పది సంవత్సరాల వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడడం మొదలుపెట్టింది నీలిమ. కోచ్ భాస్కర్ బాబు సహాయంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సెలెక్ట్ అయింది. పది సంవత్సరాల పాటు.. సింగిల్స్, డబుల్స్‌లో రెండింటిలోనూ రాణించింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో ఎన్నో పతకాలను సాధించింది. నేషనల్స్‌లో 2వ ర్యాంక్ వరకు వచ్చింది.

డబుల్స్‌లో కూడా నెంబర్ వన్ స్థానంలోనే ఉండేది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఇండియా తరుపున ప్రాతినిధ్యం వహించింది. ఇప్పుడు తన వయసు నలభై సంవత్సరాలు. ఇక ఆటకు స్వస్తి పలుకాలనుకుంది. కానీ గతేడాది 35 పై వయసు ఉన్నవాళ్లకు బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ జరిగింది. దాంట్లో కాంస్య పతకం గెలిచింది. 2002 వరకు ఆమె బ్యాడ్మింటన్‌ని సీరియస్‌గా ఆడింది. ఆ తర్వాత దెబ్బల మూలంగా బ్యాడ్మింటన్‌ని వదిలేసింది. ఖాళీగా ఉండలేక ఇదిగో ఇలా టీ బొటిక్‌ని మొదలుపెట్టి సక్సెస్ అందుకున్నది.

ఎన్నో వెరైటీలు..

Sowmya1 క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. రకరకాల టీలను తయారు చేయడానికి ఎన్నో ప్రయోగాలు చేశా. ఒకవేళ నాకు నచ్చకపోతే వాటి జోలికి వెళ్లను. ఎందుకంటే అవి బాగాలేకపోతే నేను వాటి గురించి ఇతరులకు వివరించలేను. నా టీలన్నీ డార్జిలింగ్ నుంచి వస్తాయి. అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది. అక్కడ నా ప్రయోగాలను వివరించి తయారు చేయించుకుంటా. మొత్తం మీద 26 హాట్ వెరైటీస్, 10 కోల్డ్ వెరైటీలు మా వద్ద దొరుకుతాయి. త్వరలో బ్రాంచ్‌లుగా విస్తరించాలని అనుకుంటున్నా. వీటితోపాటు కొబ్బరినూనె, రోజ్‌వాటర్‌లను కూడా తయారు చేయాలని భావిస్తున్నా.

మంచి కుంకుమపువ్వును కశ్మీర్ నుంచి తెప్పించాలని ఆలోచిస్తున్నా. ఇది ఇంకా కార్యరూపం రావడానికి కాస్త సమయం పట్టొచ్చు. నా భర్త ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తారు. నేను వ్యాపారంలోకి రావడానికి ఆయన సహకారం ఎంతో ఉంది. గ్లాస్, సిరమిక్‌లోటీ ఆకులను ప్యాక్ చేస్తా. ఈ టీలతో కస్టమైజ్డ్ గిఫ్ట్ ప్యాక్‌లు కూడా తయారు చేస్తున్నాం.

…? సౌమ్య నాగపురి 
చిన్న యాదగిరి గౌడ్

Leave A Reply