Business is booming.

బాలయ్యకు ఎన్టీఆర్ డబ్బింగ్!

సంక్రాంతి కోసం తెలుగువారందరూ ఎదురు చూస్తారు. ఈ సారి మాత్రం సంక్రాంతితో పాటూ రాబోతోన్న ‘ఎన్టీఆర్’ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. దర్శకుడు క్రిష్ ‘ఎన్టీఆర్’ బయోపిక్‌కి రోజుకో ఆశ్చర్యాన్ని అద్దుతున్నాడు.
ఎన్టీఆర్ జీవిత చరిత్రని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరిగిపోతోంది. చాలా మంది ప్రముఖల పాత్రలకి మళ్లీ ప్రముఖ నటీనటులను ఎంపిక చేసి నిన్న మొన్నటి వరకూ వార్తల్లో నిలిచారు దర్శక, నిర్మాతలు. అయితే, ఇప్పుడు జనం దృష్టంతా సినిమా ఎలా రాబోతోందనే దానిపైనే ఉంది. అన్న ఎన్టీఆర్ జీవితంలో అనేక అద్భుత సన్నివేశాలు, సంఘటనలకు కొదవే లేదు. అవన్నీ డైరెక్టర్ క్రిష్ ఎలా సినిమాలో పొదుగుతారోనని ఉత్కంఠ నెలకొంది. అందరి ఆసక్తికి తగ్గట్టే హీరో బాలయ్య, దర్శకుడు క్రిష్ సినిమాకు క్రేజ్ తెచ్చే ఏ అంశమూ వదలిపెట్టడం లేదు.
‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ అంటూ రెండు భాగాలుగా జనవరిలో జనం ముందుకు రాబోతోన్న తమ సినిమా కోసం ఓ వినూత్నమైన ఆలోచన చేశాడట క్రిష్. తాజా సమాచారం ప్రకారం ఆయన బాలకృష్ణ ముందుర ఓ ప్రపోజల్ పెట్టారట. ఎన్టీఆర్ పొలిటికల్ స్పీచుల్లో చాలా వరకూ హిస్టారికల్. ఆయన వాడిన పదాలు, వ్యాఖ్యానాలు అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. అందుకే, వాట్ని యథాతథంగా అన్నగారి వాయిస్‌లోనే ఉపయోగించుకుందాం అన్నాడట.
అంటే, తెరపై రాజకీయ బహిరంగ సభల్లో ఎన్టీఆర్‌లా బాలయ్య కనిపిస్తారు. కానీ, డబ్బింగ్ మాత్రం నందమూరి తారక రాముడిది వినిపిస్తుంది. ఒక విధంగా, తండ్రి పాత్రలో కొడుకు, కొడుకు కంఠంగా తండ్రీ… అన్నమాట. దీనికి ఇంకా బాలకృష్ణ సై అన్నాడా లేదా తెలియదు. కానీ, ఆయన ఓకే చేస్తే మాత్రం  థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌కి గొప్ప థ్రిల్ మిగలటం మాత్రం ఖాయం.

Comments are closed, but trackbacks and pingbacks are open.